మహా శివరాత్రి విశిష్టత. 

On
మహా శివరాత్రి విశిష్టత. 

మహాశివరాత్రి సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశంలోని అనేక ప్రాంతాల్లో శివాలయాలు భక్తుల శివ నామస్మరణతో మారుమోగిపోతున్నాయి. కాశి, శ్రీశైలం, శ్రీకాళహస్తి, రామేశ్వరం, అరుణాచలం వంటి క్షేత్రాలు లక్షలాదిగా భక్తులతో కిటకిటలాడుతున్నాయి శివరాత్రి ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం.

భారత దేశపు ముఖ్య పండుగలలో శివరాత్రి ప్రశస్తమైనది. ప్రతీ ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర యుక్తుడైనప్పుడు వస్తుంది. ఇది శివ భక్తులకు అత్యంత పర్వదినం. శివుడు ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో ఉన్నది.

మహాశివ రాత్రి మహాత్య వృత్తాంతం.
శివ పురాణములోని విద్యేశ్వర సంహితలో చెప్పబడింది.

గంగా యమునా సంగమ స్థానమైన ప్రయాగలో (నేటి అలహాబాదు) ఋషులు సత్రయాగం చేస్తున్నసమయంలో రోమర్షణమహర్షి అని పేరు గాంచిన సూతమహర్షి అక్కడకు వచ్చాడు. ఆలా వచ్చిన సూతమహర్షికి అ ఋషులు నమస్కరించి సర్వోత్తమమైన ఇతిహాస వృత్తాంతాన్ని చెప్పుమనగా అతను తనకు గురువైన వేదవ్యాసుడు తనకు చెప్పిన గాధను వివరించడం ప్రారంభిస్తాడు. ఒకసారి పరాశర కుమారుడైన వ్యాస మహర్షి సరస్వతీ నదీ తీరమున ధ్యానం చేస్తున్నాడు. ఆ సమయంలో సూర్యుని వలె ప్రకాశించే విమానంలో సనత్కుమారుడు వెళ్ళుతున్నాడు.. దానిని గమనించిన వ్యాసుడు బ్రహ్మ కుమారుడైన సనత్కుమారునకు నమస్కరించి ముక్తిని ప్రసాదించే గాధను తెలుపుమంటాడు.

అప్పుడు మందర పర్వతం మీద బ్రహ్మ కుమారుడైన సనత్కుమారుడు తనకు, నందికేశ్వరునికి మధ్య జరిగిన సంవాదాన్ని వ్యాసునికి చెప్పగా, వ్యాసుడు సూతునికి చెప్పిన వృత్తాంతాన్ని సత్రయాగంలో ఋషులకు చెబుతాడు. సనత్కుమారుడు నందికేశ్వరుడిని శివుని సాకారమైన మూర్తిగా , నిరాకారుడైన లింగంగా పూజించడానికి సంబంధించిన వృత్తాంతాన్ని చెప్పమంటాడు. దానికి సమాధానంగా నందికేశ్వరుడు ఈ వృత్తాంతాన్ని చెబుతాడు.

బ్రహ్మ, విష్ణువుల యుద్ధం-

ఒకప్పుడు ప్రళయ కాలం సంప్రాప్తము కాగ మహాత్ములగు బ్రహ్మ, విష్ణువులు ఒకరితో ఒకరు యుద్ధానికి దిగిరి. ఆ సమయంలోనే మహాదేవుడు లింగరూపంగా ఆవిర్భవించెను. దాని వివరాలు ఇలాఉన్నాయి. ఒకప్పుడు బ్రహ్మ అనుకోకుండా వైకుంఠానికి వెళ్ళి, శేషశయ్యపై నిద్రించుచున్న విష్ణువును చూసి, "నీవెవరవు నన్ను చూసి గర్వముతో శయ్యపై పరుండినావు లెమ్ము. ఆరాధనీయుడైన గురువు వచ్చినప్పుడు గర్వించిన మూఢుడికి ప్రాయశ్చిత్తం విధించబడును" అని అన్నాడు. ఆ మాటలు విన్న విష్ణువు బ్రహ్మను ఆహ్వానించి, ఆసనం ఇచ్చి, "నీ చూపులు ప్రసన్నంగా లేవేమి?" అన్నాడు. దానికి సమాధానంగా బ్రహ్మ "నేను కాలముతో సమానమైన వేగముతో వచ్చినాను. పితామహుడను. జగత్తును, నిన్ను కూడా రక్షించువాడను" అంటాడు. అప్పుడు విష్ణువు బ్రహ్మతో "జగత్తు నాలో ఉంది. నీవు చోరుని వలె ఉన్నావు. నీవే నా నాభిలోని పద్మమునుండి జన్మించినావు. కావున నీవు నా పుత్రుడవు. నీవు వ్యర్థముగా మాట్లాడు తున్నావు" అన్నాడు.

ఈ విధంగా బ్రహ్మ విష్ణువు ఒకరితోనొకరు సంవాదములోనికి దిగి, చివరికి యుద్ధసన్నద్దులౌతారు. బ్రహ్మ హంస వాహనం పైన, విష్ణువు గరుడ వాహనం పైన ఉండి యుద్ధాన్ని ఆరంభించారు. ఈ విధంగా వారివురు యుద్ధం చేయుచుండగా దేవతలు వారివారి విమానాలు అధిరోహించి వీక్షిస్తున్నారు. బ్రహ్మ, విష్ణువుల మధ్య యుద్ధం అత్యంత ఉత్కంఠతో జరుగుతూ ఉంటే వారు ఒకరి వక్షస్థలం పై మరొకరు అగ్నిహోత్ర సమానమైన బాణాలు సంధించుకొన సాగిరి. ఇలా సమరం జరుగుచుండగా, విష్ణువు మాహేశ్వరాస్త్రం, బ్రహ్మ పాశుపతాస్త్రం ఒకరిమీదకు ఒకరు సంధించుకొన్నారు. ఆ అస్త్రాలను వారు సంధించిన వెంటనే సమస్త దేవతలకు భీతి కల్గింది. ఏమీ చేయలేక, దేవతలందరు శివునికి నివాసమైన కైలాసానికి బయలు దేరారు. ప్రమథగణాలకు నాయకుడైన శివుని నివాసస్థలమైన కైలాసంలో మణులు పొదగబడిన సభా మధ్యంలో ఉమాసహితుడై తేజస్సుతో విరాజిల్లుతున్న మహాదేవునికి దేవతలు ఆనందభాష్పాలతో సాష్టాంగంగా ప్రణమిల్లారు. అప్పుడు ప్రమథ గణాలచేత శివుడు దేవతలను దగ్గరకు రమ్మని అహ్వానిస్తాడు. అన్ని విషయాలు ఎరిగిన శివుడు దేవతలతో "బ్రహ్మ, విష్ణువుల యుద్ధము నాకు ముందుగానే తెలియును. మీ కలవరము గాంచిన నాకు మరల చెప్పినట్లైనది " అంటాడు. శివుడు సభలో ఉన్న వంద ప్రమథ గణాలను యుద్ధానికి బయలుదేరమని చెప్పి, తాను అనేక వాద్యములతో, అలంకారములతో కూడిన వాహనం పై రంగు రంగుల ధ్వజముతో, వింజామరతో, పుష్పవర్షముతో, సంగీతము నాట్యమాడే గుంపులతో, వాద్య సముహంతో, పార్వతీదేవి తో బయలుదేరుతాడు. యుద్ధానికి వెళ్ళిన వెంటనే వాద్యాల ఘోషను ఆపి, రహస్యంగా యుద్ధాన్ని తిలకిస్తాడు. మాహేశ్వరాస్త్రం, పాశుపతాస్త్రం విధ్వంసాన్ని సృష్టించబోయే సమయంలో శివుడు అగ్ని స్తంభ రూపంలో ఆవిర్భవించి ఆ రెండు అస్త్రాలను తనలో ఐక్యం చేసుకొంటాడు. బ్రహ్మ, విష్ణువులు ఆశ్చర్య చకితులై ఆ స్తంభం ఆది, అంతం కనుగొనడం కోసం వారివారి వాహనాలతో బయలు దేరారు. విష్ణువు అంతము కనుగొనుటకు వరాహరూపుడై, బ్రహ్మ ఆది తెలుకొనుటకు హంసరూపుడై బయలుదేరారు. ఎంతపోయినను అంతము తెలియకపోవడం వల్ల విష్ణుమూర్తి వెనుకకు తిరిగి బయలుదేరిన భాగానికి వచ్చాడు. బ్రహ్మకు పైకి వెళ్ళే సమయంలో మార్గమధ్యంలో కామధేనువు క్రిందకు దిగుతూను, ఒక మొగలి పువ్వు(బ్రహ్మ, విష్ణువుల సమరాన్ని చూస్తూ పరమేశ్వరుడు నవ్వినప్పుడు ఆయన జటాజూటం నుండి జారినదే ఆ మొగలి పువ్వు) క్రింద పడుతూనూ కనిపించాయి. ఆ రెంటిని చూసి బ్రహ్మ 'నేను ఆది చూశాను అని అసత్యము చెప్పండి. ఆపత్కాలమందు అసత్యము చెప్పడము ధర్మ సమ్మతమే" అని చెప్పి కామధేనువు తోను, మొగలి పువ్వుతోను ఒడంబడిక చేసుకున్నాడు. వాటితో ఒడంబడిక చేసుకొన్న తరువాత బ్రహ్మ తిరిగి స్వస్థానానికి వచ్చి,అక్కడ డస్సి ఉన్న విష్ణువు ని చూసి, తాను ఆదిని చూశానని, దానికి సాక్ష్యం కామధేనువు, మొగలి పువ్వు అని చెప్పాడు. అప్పుడు విష్ణువు ఆ మాటను నమ్మి బ్రహ్మకి షోడశోపచారాలతో పూజ చేసాడు. కాని,శివుడు ఆ రెండింటిని వివరము అడుగగా, బ్రహ్మ స్తంభం ఆదిని చూడడం నిజమేనని మొగలి పువ్వు చెప్పింది. కామధేనువు మాత్రం నిజమేనని తల ఊపి, నిజం కాదని తోకను అడ్డంగా ఊపింది. జరిగిన మోసాన్ని తెలుసుకున్న శివుడు కోపోద్రిక్తుడైనాడు. మోసము చేసిన బ్రహ్మను శిక్షించడం కోసం శివుడు అగ్నిలింగ స్వరూపం నుండి సాకారమైన శివుడి గా ప్రత్యక్ష మయ్యాడు. అది చూసిన విష్ణువు, బ్రహ్మ సాకారుడైన శివునకు నమస్కరించారు. శివుడు విష్ణువు సత్యవాక్యానికి సంతసించి ఇకనుండి తనతో సమానమైన పూజా కైంకర్యాలు విష్ణువు అందుకొంటాడని, విష్ణువుకి ప్రత్యేకంగా క్షేత్రాలు ఉంటాయని ఆశీర్వదించాడు.

బ్రహ్మకు శాపము

శివుడు బ్రహ్మ గర్వము అణచడానికి తన కనుబొమ్మల నుండి భైరవుడిని సృష్టించి పదునైన కత్తితో ఈ బ్రహ్మను శిక్షించుము అని చెబుతాడు.ఆ భైరవుడు వెళ్లి బ్రహ్మ పంచముఖాలలో ఏ ముఖము అయితే అసత్యము చెప్పిందో ఆ ముఖాన్ని పదునైన కత్తితో నరికి వేస్తాడు. అప్పుడు మహావిష్ణువు శివుడి వద్దకు వెళ్లి, పూర్వము ఈశ్వర చిహ్నంగా బ్రహ్మకు ఐదు ముఖాలు ఇచ్చి ఉంటివి. ఈ మొదటి దైవము అగు బ్రహ్మను ఇప్పుడు క్షమించుము అన్నాడు. ఆ మాటలు విన్న శివుడు బ్రహ్మని క్షమించి, బ్రహ్మకు స్థానము, పూజ , అభిషేకము మున్నగునవి ఉండవు అని చెప్పాడు. నిన్ను అగ్నిష్టోమము, యజ్ఞములలో గురుస్థానములో నిలబెడుతున్నాను  అని విష్ణువుతో చెప్పాడు. అంగం దక్షిణలు ఇచ్చిన బ్రహ్మా నీవు లేని యజ్ఞము వ్యర్థము అగును.

మొగలి పువ్వుకు శాపము

ఆతరువాత కేతకీపుష్పము వైపు చూసి , అసత్యము పల్కిన నీతో పూజలు ఉండకుండా ఉండు గాక అని అనగానే దేవతలు కేతకీపుష్పాన్ని దూరంగా ఉMచారు. దీనితో కలతచెందిన కేతకీపుష్పము పరమేశ్వరుడవైన నిన్ను చూసిన తరువాత కూడా అసత్య దోషము ఉండునా అని మహాదేవుడిని స్తుతించింది. దానితో ప్రీతి చెందిన శివుడు అసత్యము చెప్పిన నిన్ను ధరించడం జరగదు, కాని కేతకీపుష్పాన్ని నా భక్తులు ధరిస్తారు. అదేవిధంగా కేతకీపుష్పము ఛత్ర రూపములో నాపై ఉంటుంది అని చెబుతాడు.

శివరాత్రి పర్వదినం

ఆ తరువాత బ్రహ్మ, విష్ణువు ఆదిగా గల దేవతలు శివుడిని ధూపదీపాలతో అర్చించారు. దీనికి మెచ్చి శివుడు అక్కడి వారితో "మీరీనాడు చేసిన పూజకు సంతసించితిని. ఈ రోజు నుండి నేను అవతరించిన ఈ తిథి శివరాత్రి పర్వదినముగా ప్రసిద్ధి చెందుతుంది.

ఈ రోజున ఉపవాసము చేసి భక్తితో నన్ను లింగ రూపముగా, సాకార రూపముగా ఎవరు అర్చిస్తారో వారికి మహాఫలము కలుగుతుంది" అని చెప్పాడు. తాను ఈ విధంగా అగ్నిలింగరూపముగా ఆవిర్భవించిన ప్రదేశము అరుణాచలముగా ప్రసిద్ధిచెంద గలదని చెబుతాడు.

శివరాత్రి నాడు ఏమి చేయాలి?

"మహాశివరాత్రి" పర్వదినాన ఉదయం ఐదు గంటలకే నిద్రలేచి, శుచిగా తలస్నానం చేసి, పూజా మందిరమును, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. గుమ్మానికి తోరణాలు, పూజామందిరాన్ని ముగ్గులు, రకరకాల పుష్పాలతో అలంకరించుకోవాలి. తెలుపు రంగు బట్టలను ధరించి, శివుని పటాలు, లింగాకార ప్రతిమలకు పసుపు కుంకుమలు పెట్టి పూజకు సిద్ధం చేసుకోవాలి. 

మారేడు దళములు, తెల్లపూల మాలతో భోళాశంకరుడి అలంకరించి, పొంగలి, బూరెలు, గారెలు, అరటి, జామకాయలను నైవేద్యంగా సమర్పించి నిష్టతో పూజించాలి. పూజా సమయంలో శివఅష్టోత్తరము, శివపంచాక్షరీ మంత్రములను స్తుతిస్తే అష్టైశ్వర్యాలు, మోక్షమార్గాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు. 

అదేవిధంగా.. నిష్ఠతో ఉపవాసముండి శివసహస్ర నామము, శివ పురాణము, శివారాధన పారాయణం చేసే వారికి మరు జన్మంటూ లేదని శాస్త్రాలు చెబుతున్నాయి. శివరాత్రి సాయంత్రం ఆరు గంటల నుంచి, మరుసటి రోజు ఉదయం ఆరుగంటల వరకు శివపరమాత్మ స్తోత్రములతో ఆయన పూజ చేసిన వారికి కైలాస వాసం ప్రాప్తిస్తుందని పండితులు అంటున్నారు.

శివరాత్రి రోజున శివునికి అభిషేకం ఎలా చేయాలంటే..!?

శ్లో|| పుర్రె చేసిన పుణ్యమేమో! పంచ చేరి నీకు కంచమాయే !
వల్లకాటి భాగ్యమేమో ! తనకు తానే నీకు మంచమాయే ! అన్నట్లు శివునికి అభిషేకం అంటే ఎంతో ఇష్టమని పురోహితులు చెబుతున్నారు. పదార్థాలు ఏవైనప్పటికీ శివుడు ముమ్మాటికీ అభిషేక ప్రియుడంటున్నారు. 

ఈ క్రమంలో మహాశివరాత్రి రోజున ఏ పదార్థాలతో శివునిని అభిషేకిస్తే ఎటువంటి ఫలితం దక్కుతుందో చూద్దాం.. కస్తూరి, జవ్వాది, పునుగు, గులాబీ అత్తరు కలిపిన జల మిశ్రమంతో శివలింగానికి అభిషేకం చేస్తే శివసాయుజ్యం లభిస్తుంది. పలురకాల పువ్వులతో శివాభిషేకం నిర్వహిస్తే రాజభోగం కలుగుతుంది. వెండిధూళి లేదా వెండి రజనుతో శివాభిషేకం చేస్తే విద్యాప్రాప్తి కలుగుతుంది.

నవధాన్యములతో శివాభిషేకం చేసినట్లయితే ధన, భార్యా, పుత్రలాభం, పటికబెల్లపు పలుకులతో శివాభిషేకం చేస్తే ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఉప్పుతో అభిషేకించితే సౌభాగ్యం చేకూరుతుంది. విభూదితో చేసే అభిషేకం వలన సర్వకార్యాలు లాభిస్తాయి. బెల్లపు పలుకులతో అభిషేకం చేసినట్లయితే ప్రేమవ్యవహారాల్లో జయము కలుగుతుంది. 

వెదరు చిగుళ్ళతో అభిషేకం చేస్తే వంశవృద్ధి, పాలాభిషేకం వలన కీర్తి, సిరి, సుఖములు కలుగును. మారేడు చెట్టు బెరడు, వేర్ల నుంచి తీసిన భస్మంతో చేస్తే దారిద్రనాశనమవుతుంది. 

ఇక పలురకాల పండ్లతో చేసే అభిషేకం జయాన్నిస్తుంది.  ఉసిరికాయలతో చేస్తే మోక్షము, బంగారుపొడితే అభిషేకం చేస్తే మహాముక్తి లభిస్తుంది. అష్టదాతువులతో చేసే అభిషేకం వలన సిద్ధి, మణులతో, వాటి పొడులతో అభిషేకించితే అహంకారం తొలగిపోతుంది. పాదరసముతో అభిషేకించితే అష్టైశ్వర్యములు  లభిస్తాయి. ఆవునెయ్యి, ఆరు పెరుగుతో శివునికి అభిషేకం చేస్తే ఆయుర్ వృద్ధి కలుగుతుందని పురోహితులు చెబుతున్నారు.
మహాశివరాత్రి రోజున ఎర్రటి ప్రమిదలతో దీపమెలిగిస్తే..!?

శివాయ గౌరీ వదనాబ్జ భృంగ
సూర్యాయ దక్షాధ్వర నాశకాయ 
శ్రీ నీలకంఠాయ వృషధ్వజాయ 
తస్మై శ్రీకారాయ నమశ్శివాయ ||
అంటూ ముక్కంటిని స్తుతిస్తూ మహాశివరాత్రి రోజున ఎర్రటి ప్రమిదలతో దీపమెలిగిస్తే కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. మహేశ్వరుడిని మహాశివరాత్రి రోజున లింగోద్భవమూర్తిగా ఉన్న ముక్కంటిని పూజిస్తే సకలసంపదలు చేకూరుతాయి. 

అందుచేత మహాశివరాత్రి రోజున సూర్యోదయానికి ముందే లేచి, తలస్నానము చేయాలి. అటుపిమ్మట పూజామందిరము, ఇంటిని శుభ్రం చేసుకుని, గడపకు పసుపు కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజా మందిరములో ముగ్గులు, పుష్పాలతో అలంకరించుకోవాలి. ఈ రోజున తెల్లటి దుస్తులు ధరించడం మంచిది. 

పూజకు శివుని ఫోటోగానీ లేదా, లింగాకారముతో గల విగ్రహాన్ని సిద్ధం చేసుకోవాలి. అలాగే మారేడు దళములు, తెల్లపూలమాల, నైవేద్యానికి పొంగలి, బూరెలు, గారెల్, అరటి , జామకాయలు సమర్పించుకోవచ్చు.

పూజకు ముందుశివఅష్టోత్తరము, దారిద్ర్యదహన స్తోత్రము, శివారాధన, శివపురాణము, లింగోద్భవ అధ్యాయము వంటివి పారాయణము చేయడం ద్వారా శుభఫలితాలుంటాయి. ఇంకా శివరాత్రి రోజున శ్రీశైలం, శ్రీకాళహస్తి, ద్రాక్షారామం వంటి ఆలయాలను దర్శించడం ద్వారా ఆర్థికాభివృద్ధి, వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. 

ఇంకా శివరాత్రిరోజున ఆలయంలో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, ఏకాదశ రుద్రాభిషేకం, 108 బిందెలతో రుద్రాభిషేకం, శివకళ్యాణము వంటివి నిర్వహించడం శుభఫలితాలిస్తాయని పురోహితులు చెబుతున్నారు.

మహాశివరాత్రి రోజు సాయంత్రం ఆరు గంటల నుంచి మరుసటి రోజు ఉదయం ఆరు వరకు పూజ చేసుకోవచ్చు. దీపారాధనకు నువ్వులనూనె, ఐదు వత్తులు ఉపయోగించాలి. పంచహారతి ఇవ్వడం మంచిది. అలాగే ఇంటికి వచ్చిన ముత్తైదువులకు శివభక్తిమాల, శివకళ్యాణము వంటి పుస్తకాలను తాంబూలముతో కలిపి ఇవ్వాలి.

Tags:

About The Author

RK Agni News Desk Picture

Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.

Advertisement

Latest News

సమయం ఆసన్నమైంది: RSS చీఫ్ మోహన్ జి భగవత్ సమయం ఆసన్నమైంది: RSS చీఫ్ మోహన్ జి భగవత్
నాగపూర్ (మహారాష్ట్ర): జమ్మూకాశ్మీర్లోని పహల్గామ్ పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిపై RSS చీఫ్ మోహన్ భగవత్ స్పందించారు. 'భారతదేశం శక్తివంతమైనదని చూపించాల్సిన సమయం ఆసన్నమైంది. మా హృదయాల్లో...
నేటి పంచాంగం:  *శనివారం, ఏప్రిల్ 26, 2025*
హైదరాబాద్ లో 200 కు పైగా పాకిస్తానీయులు
ఎన్ కౌంటర్ ఆపండి.. చర్చలకు సిద్ధం: మావోయిస్టులు
విజయవాడ లో 10 మంది ఉగ్రవాదులు?
నేటి పంచాంగం:  *శుక్రవారం, ఏప్రిల్ 25, 2025*
చలివేంద్రం లో మజ్జిగ పంపిణీ ప్రారంభించిన ఛైర్మన్ చిర్లంచర్ల