జిల్లా లో ఉచిత ఇసుక విధానం గురించి కలెక్టర్, ఎస్పీ లు ఏమన్నారంటే?
ప్రకాశం జిల్లా: ఉచిత ఇసుక విధానాన్ని పకడ్బందీగా అమలు చేయడం మా కర్తవ్యం అని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ప్రకటించారు. గురువారం ఆమె, జిల్లా ఎస్పీ దామోదర్ తో కలిసి ప్రకాశం భవనం లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సెప్టెంబర్ 11వ తేదీన నూతన ఉచిత ఇసుక విధానం వస్తుందన్నారు. అప్పటి వరకు ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉచిత ఇసుక పంపిణీకి ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం జిల్లాలో మూడు స్టాక్ పాయింట్ల ద్వారా ఇసుక పంపిణీ జరుగుతుందన్నారు. జిల్లాలో 4వేల మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉందని చెప్పారు. అవసరమైన పక్షంలో పొరుగు జిల్లాల నుంచి ఇసుక పంపిణీకి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇసుక కావాల్సిన వారు స్టాక్ పాయింట్ సమీపంలోని సచివాలయంలో ఇసుక బుక్ చేసుకోవాలన్నారు. ఇసుక లోడింగ్, రవాణాకు సంబంధించి ఒక ఇన్ వాయిస్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇసుక లోడింగ్ కు సంబంధించి నిర్దేశించిన సమయానికి మాత్రమే వాహనాలు స్టాక్ పాయింట్ వద్దకు రావాలన్నారు. రవాణాకు సంబంధించి ట్రాక్టర్లు, లారీలకు వాటి కేటగిరి వారీగా నిర్దిష్ట చార్జీలను నిర్ధారించామన్నారు. అనధికారికంగా ఇసుక తవ్వినా, రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఉచిత ఇసుక పంపిణీపై ప్రజలు ఫిర్యాదు చేయడానికి టోల్ ఫ్రీ నంబర్లు 1800 599 4599 లేదా 6281799518 అందుబాటులో ఉన్నాయని చెప్పారు.జిల్లా ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లాలో ఇసుక సరఫరా, రవాణాను ప్రభుత్వం మరింత కట్టుధిట్టం చేసిందని, వాహనాల బుకింగ్ స్లిప్ ఉన్న వాహనాలను మాత్రమే అనుమతించడం జరుగుతుందని, ఇవి లేకుండా ఇసుకను తరలించే వాహనాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ ఉచిత ఇసుక విధానానికి తూట్లు పొడవడానికి ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, వారిపై పీ.డి. యాక్ట్ కింద చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఆర్. గోపాలకృష్ణ, ఏఎస్పి కె.నాగేశ్వరరావు, గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ జగన్నాధరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
About The Author
Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.