నేడు..డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి (సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం)

On
నేడు..డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి (సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం)

మట్టిలో మాణిక్యాలను వెలికితీసి రత్నాలుగా మలిచేది, బండరాయిని రమణీయమైన శిల్పా లుగా చెక్కేది... అజ్ఞాన తిమిరంలో విజ్ఞాన జ్యోతులు వెలిగించేది... సమాజ స్థితిగతులను అధ్యయనం చేసి నవతరానికి ప్రగతిబాటను పరిచేది... ఒక్క ఉపాధ్యాయుడే. అందుకే ఆయనకు అంతటి గౌరవం. గురువుగా అత్యున్నత పీఠం. తన శిష్యులను ఉన్నత శిఖరాలకు నడిపించి... తాను మాత్రం నేలపైనే వుండి వారి ఎదుగుదలకు సోపాన మౌతాడు. మార్గదర్శకమౌతాడు. కొండలలో ఉన్న బండ రాళ్ళను శిల్పి తన చాక చక్యం తో చెక్కి , తన కళా నైపుణ్యంతో  తీర్చిదిద్ది దేవతా శిల్పాలను తయారు చేస్తాడు అలాగే  బండరాళ్ల లాంటి విద్యార్థులను, శిల్పి లాంటి ఉపాధ్యాయుడు , తన భోదన లాంటి నైపుణ్యంతో  తీర్చిదిద్ది సుగుణ మూర్తులుగా తయారు జేస్తాడు. నిజమైన సమర్ధవంతమైన మంచి గురువులు ఎవరంటే మనలని ఆలోచింప చేసేవారు, మన ఆలోచనాశక్తిని పెంపొందించే వారు. సాదారణ ఉపాధ్యాయుడు కేవలం పాఠం చెబుతాడు, మంచి ఉపాధ్యాయుడు పాఠాన్ని వివరిస్తాడు , ఉత్తమ ఉపాధ్యాయుడు ఉదాహరణలతో భోదిస్తాడు , గొప్ప ఉపాధ్యాయుడు విద్యార్థి లో నిగూడంగా దాగి ఉన్న శక్తులను వెలికి తీసి, అతని మూర్తిమత్వాన్ని అభివృద్ది చేయుటలో ఉత్తేజ పరుస్తాడు. 

వెలుగుతున్న దీపమే మరిన్ని దీపాల్ని వెలిగిస్తుంది. అలాగే ఎల్లప్పుడూ నేర్చుకునే వారే ఇతరులకు నేర్పగలరు. నేర్చుకోవడం నిరంతర ప్రక్రియ. దీనిలో నిమగ్నమైనవారు మాత్రమే ఇతరులకు నేర్పగలరు. బోధించగలరు. కేవలం పాఠ్యాంశాల్ని మాత్రమే కాదు, జీవితంలోని సమస్త అంశాల్ని బోధించడం ఉపాధ్యాయుల కర్తవ్యం. ఏ దశలోనూ సిలబస్‌కే పరిమితం కావడం సరి అయిన ఉపాధ్యాయుడి  లక్షణం కాదు. విషయం ఏదైనా చుట్టూ ఉన్న సమాజంతో, దాని నడవడికతో అనుసంధానిస్తూ చెప్పడంలోనే బోధనాకళ ఇమిడివుంది. దీనిని అర్థం చేసుకుని బోధనాభ్యసన కార్యక్రమం నిర్వహించడం ఉపాధ్యాయుల అంకితభావం మీద ఆధారపడి వుంది. ఎందుకంటే బోధన వృత్తి మాత్రమే కాదు, అదొక జీవనవిధానం. సున్నితమైన పిల్లల ప్రపంచాన్ని ప్రభావితం చేసే సంవిధానం. శిల్పి కన్నా, వజ్రాలను సానబెట్టే వాడి కన్నా ఉపాధ్యాయుల పని అత్యంత సున్నితత్వంతో కూడుకొని వున్నది. అతడు ప్రాణం కలిగిన, చైతన్యశీలురైన పిల్లలతో సంబంధం కలిగి వున్నాడు.అందుకే మన సమాజంలో గురువుకు అధిక ప్రాదాన్యత ఇచ్చారు. గురువును దైవంతో పోల్చారు. తల్లిదండ్రులు జన్మనిస్తే అతడికి విద్యా బుద్దులు నేర్పి సమాజంలో ఒక ఉన్నత స్థానం అందించే బాధ్యత గురువు తీసుకున్నాడు. కాబట్టి గురువుకు అంత ప్రాదాన్యత. 
గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్ పరంబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః
అటువంటి గురువుకి ఒక రోజు కేటాయించడ మైనది.అదే జాతీయ ఉపాధ్యాయ  దినోత్సవం. 

డా. సర్వేపల్లి రాధాకృష్ణన్   భారతదేశపు  మొట్ట మొదటి  ఉపరాష్ట్రపతి మరియు రెండవ రాష్ట్రపతి కూడా. అంతేకాదు భారతీయ తాత్విక చింతనలో పాశ్చాత్య తత్వాన్ని ప్రవేశ పెట్టినాడని విశేషమైన పేరు .. రెండు పర్యాయాలు ఉపరాష్ట్రపతి పదవి చేపట్టి, తరువాత రాష్ట్రపతిగా ఒక పర్యాయం పదవిని చేపట్టి, భారతదేశపు అత్యంత క్లిష్టకాలం అయిన  చైనా, పాకిస్తానులతో యుద్ధ సమయంలో   ప్రధానులకు మార్గనిర్దేశం చేసిన మహానుబావుడు. ఈ రోజు ఆయన పుట్టినరోజు. ఉపాధ్యాయ వృత్తికి ఆయన తెచ్చిన గుర్తింపు, గౌరవమునకుగాను ప్రతీ సంవత్సరం ఆయన పుట్టిన రోజైన సెప్టెంబర్ 5ను ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ రోజున దేశం మొత్తం ఆయనను స్మరిస్తూ, ఆయన ఘన చరితలను కీర్తిస్తూ, విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి, పాఠశాల అభివృద్ధికి కృషి చేసిన వారిని గౌరవిస్తూ, వారు చేసిన సేవలను కొనియాడుతూ వారి జ్ఞాపకార్థంగా దేశం మొత్తం  జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం నిజంగా ఉపాధ్యాయులకు ఆయన ఇచ్చిన వరం గా పేర్కొనవచ్చు. 
సర్వేపల్లి రాధాకృష్ణన్ సెప్టెంబర్ 5, 1888 మద్రాసుకు ఈశాన్యంగా 64 కి.మీల దూరమున ఉన్న తిరుత్తణిలో సర్వేపల్లి వీరస్వామి, సీతమ్మ దంపతులకు జన్మించాడు. వీరాస్వామి ఒక జమీందారీలో తహసిల్దార్. వారి మాతృభాష తెలుగు. సర్వేపల్లి బాల్యము మరియు విద్యాభ్యాసము ఎక్కువగా తిరుత్తణి మరియు తిరుపతిలోనే గడిచిపోయాయి. బాల్యం నుండి అసాధారణమైన తెలివితేటలు కలవాడాయాన. అతడేమీ సంపన్నుల కుటుంబం నుండి రాలేదు. అతి సాదారణ స్థాయి నుండి అసాదారణ స్థాయి కి ఆయన ప్రయాణం మనకందరికీ ఆదర్శం. భోజనం చేసేందుకు అరిటాకు కూడా కొనలేని పరిస్థితుల్లో ఆయన నేలను శుభ్రపరచుకొని భోజనం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయంటే అతని దీన పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అలాంటి ఆయన ఎంతో కష్టపడి దేశ అత్యున్నత స్థానానికి చేరడం ఎంతో గొప్పదనం. అధ్యాపకుడిగా, వైస్‌ ఛాన్సలర్‌గా, దౌత్యవేత్తగా, ఉప రాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా ఆయన సేవలు నిరుపమానం, అనితరసాధ్యం. ఆయన అధిరోహించిన శిఖరాలు ఆయన జీవితంలోని అసాధారణ కోణాలను మనకు వెల్లడి చేస్తాయి. రాధాకృష్ణన్‌ బాల్యం నుంచే అసాధారణమైన తెలివితేటలు కనబరిచేవారు. ఆయన తెలివితేటలకు ఉపాధ్యాయులు ముగ్ధులయ్యేవారు. విద్యార్ధిగా వున్నపుడే మనస్తత్వశాస్త్రంపై బాగా అధ్యయనం చేసి ఆయన ఇచ్చిన ఉపన్యాసాలు అందరినీ ఆకట్టుకునేవి. 
 21 సంవత్సరాలైనా దాటని వయసులో ఆయన మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో  ప్రొఫెసర్ అయ్యాడు. తత్వశాస్త్రంలో అతని ప్రతిభను విని  మైసూరు విశ్వవిద్యాలయం ఉపకులపతి హెచ్.వి.నంజుండయ్య అతనిని పిలిపించి ప్రొఫెసర్ గా నియమించాడు. ఆయన ఉపన్యాసాలను ఎంతో శ్రద్ధగా వినేవారు విద్యార్థులు. కలకత్తా విశ్వవిద్యాలయంలో ఆచార్య పదవి చేపట్టమని, డా. అశుతోష్ ముఖర్జీ, రవీంద్రనాథ ఠాగూర్ లు కోరారు. వారి ఆహ్వానం మేరకు ఆయన అక్కడికి వెళ్లారు. అప్పుడే ఆయన కీర్తి దశదిశలా వ్యాపించింది.  కలకత్తా విశ్వవిద్యాలయంలో ఆచార్యుడుగా వున్నప్పుడు ఆయన ్టభారతీయ తత్వశాస్త్రం” అన్న గ్రంథం వ్రాశాడు. ఆ గ్రంథం విదేశీ పండితుల ప్రశంసలందుకున్నది. 1946లో ఏర్పడిన  భారత రాజ్యాంగ పరిషత్ సభ్యులయ్యారు.  1949 లో భారతదేశం లో ఉన్నత విద్యాసంస్కరణలు ప్రవేశపెట్టాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఒక కమిటి నియమించింది. దానికి అధ్యక్షుడు డా. రాధాకృష్ణన్. 1954 లో మానవ సమాజానికి ఆయన చేసిన కృషికి గుర్తింపుగా భారతదేశంలోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన భారతరత్న బిరుదు పొందారు.  డా.రాధాకృష్ణన్, ప్రధాని నెహ్రూ కోరిక మేరకు 1952-62 వరకు భారత ఉపరాష్ట్రపతిగా పనిచేశారు. 1931లో బ్రిటీషు ప్రభుత్వం వారు ఇచ్చే ప్రతిష్ఠాత్మక సర్ బిరుదు ఈయనను వరించింది.  రాధాకృష్ణన్ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నప్పుడు విద్యార్థులకు శ్రద్ధగా బోధించడమే కాదు, వారిపై ప్రేమాభిమానాలు చూపేవారు. ఆయన మైసూరు నుంచి కలకత్తాకు ప్రొఫెసర్‌గా వెళ్లేప్పుడు గుర్రపు బండిని పూలతో అలంకరించి తమ గురువును కూర్చోబెట్టి రైల్వేస్టేషన్ వరకు విద్యార్థులే లాక్కుంటూ వెళ్లారట. 
ఆధునిక సమాజానికి ఎలాంటి గురువు అవసరమో, అసలు గురువు ఎలా ఉండాలో ఆయన స్పష్టంగా వివరించారు. కేవలం ఒక్క గురువులకే కాక సమాజానికే ఆదర్శంగా, ఉన్నతంగా జీవించి ఆడర్శప్రాయుడయ్యాడు. ఆయన దృష్టిలో చదువంటే విద్యార్థులకు ప్రేమ, స్నేహ స్వభావాలను, సుగుణాలను పంచాలి. పిల్లలు ఉపాధ్యాయుని చూసి భయపడ రాదు. దగ్గరికి చేరాలి. అంతటి ఉపాధ్యాయవృత్తికే ఆదర్శంగా నిలిచిన ఆచార్యులు సర్వేపల్లి రాధాకృష్ణన్. ఆయన తెలుగు వారు కావడం మనందరికీ గర్వకారణం. నాలుగు దశాబ్దాల పాటు ఉపాధ్యాయ వృత్తిలో ఉండి విద్యార్థుల మధ్యనే గడిపారు. ఎదుటివారికి బోధించటం వల్ల తన విజ్ఞానం కూడా వృద్ధి చెందుతుందని మనసా వాచా నమ్మిన వ్యక్తి సర్వేపల్లి. ఆయన దృష్టిలో ఉపాధ్యాయుడి బాధ్యత ఎప్పుడూ గురుతరమైనదే. 
రాధాకృష్ణన్ గారిని గుర్తు చేసుకోవడం మనలను మనం గౌరవించు కోవడమే. ఆయన  అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి కి చెందిన యునెస్కో విభాగానికి మన దేశంనుండి  రాయబారిగా ఉన్నారు.  మన దేశానికి అంబేద్కర్ గారి తో పాటు రాజ్యాంగాన్ని రచించారు. మహామేధావిగా, గొప్పవ్యక్తిగా, గొప్ప గ్రంథకర్తగా, తత్వవేత్తగా, ప్రపంచ దేశాల గౌరవాలను అందుకున్నారు. ఆయన రాసిన హిందూ మత  వేదాంతం లోని విలువలు అనే పరిశోధనాంశాన్ని ఆయన తో పాటు పనిచేసే బ్రిటిష్ ప్రొఫెసరులు ఎంతో మెచ్చు కొన్నారు.  ఆ కాలంలో మన దేశం గురించి మన హిందూ మతము గురించి తెల్లవాళ్ళల్లో ఉన్న అపోహలన్నీ తొలగించి, మన గౌరవాన్ని కాపాడారు. ఆయన చాలా గొప్ప వేదాంతి, వాక్పటిమ కలిగిన వారు, మంచి మనిషి. మరి ఇంకా ఇరవైయ్యవ శతాబ్దంలోని విద్యావేత్తలలో మేధావులలోను అంతులేని కీర్తి సాధించారు.  రాధాకృష్ణన్ గారు రాజకీయాలలో అంత పాల్గొన లేకపోయినా శాంతియుతంగా విద్యాపరంగా ఎంతో సేవ చేశారు.   తత్వవేత్తలుగా ప్రసిద్ధి చెందిన వారెవరూ రాధాకృష్ణన్‌ పనిచేసినన్ని రంగాల్లో ప్రవేశించి ఉండరు. ఆయన పాలనాదక్షుడు, రాజనీతిజ్ఞుడు, అన్నింటినీ మించి.. ప్రాచ్య పాశ్చాత్య దేశాల్లో భారతీయ సంస్కృతికి ప్రతినిధిగా వ్యవహరించగలిగిన ప్రజ్ఞాపారాయణుడు. 
ఏ పనిలోనైనా నిబద్ధత కలిగి ఉండాలని ఆయన జీవితం మనకు పాఠం చెబుతుంది. సర్వేపల్లి జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం. సర్వేపల్లిది కొని తెచ్చుకున్న గౌరవం కాదు. అతడి గొప్పదనాన్ని చూసి వచ్చిన  గౌరవం, అది వృత్తి రీత్యా, వ్యక్తిత్వ రీత్యా, సంస్కార రీత్యా ఆయణ్ని వరించింది. ప్రపంచంలోని అనేక విశ్వవిద్యాలయాలు సర్వేపల్లిని గౌరవ డాక్టరేట్లతో సత్కరించాయి. 1954 లో భారతరత్న పురస్కారం దక్కింది. అయినా ఏనాడూ ఆడంబరాలకు పోలేదు. రాష్ట్రపతిగా ఉన్నప్పుడు వచ్చే వేతనంలో కేవలం 25 శాతం తీసుకుని మిగతాది ప్రధాన మంత్రి సహాయ నిధికి తిరిగిచ్చేవారు. రాధాకృష్ణన్ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నప్పుడు విద్యార్థులకు శ్రద్ధగా బోధించడమే కాదు, వారిపై ప్రేమాభిమానాలు చూపేవారు. ఈ రోజు ప్రభుత్వ, ప్రైవేటు, చిన్నా, పెద్దా అని చూడకుండా వారి వారి స్థాయిలో  పాఠశాలలకు, కళాశాలలకు  ఉత్తమ సేవలందించిన ఉపాధ్యాయులను ఎంపికచేసి వారికి మండల , జిల్లా ,రాష్ట్ర , జాతీయ స్థాయిలో అవార్డులు ఇవ్వడం జరుగుతున్నది. ఆయన పుణ్యమాని ఉపాధ్యాయులూ ఈ సమాజంలో గౌరవ పురస్కారాలు అందుకునే స్థాయికి వచ్చారు. ఉపాధ్యాయ వర్గం మొత్త రాధాకృష్ణన్ గారికి సర్వదా ధన్యవాదాలు తెలుపవలసి ఉంది. 

కాళంరాజు వేణుగోపాల్  ఉపాధ్యాయుడు
జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల, మార్కాపురం. 
సెల్: 8106204412

IMG-20240904-WA0055

Tags:

About The Author

RK Agni News Desk Picture

Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.

Advertisement

Latest News

జమ్మూ కాశ్మీర్ లో భారీ ఎన్‌కౌంటర్ జమ్మూ కాశ్మీర్ లో భారీ ఎన్‌కౌంటర్
జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లాలో తాజాగా భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు టెర్రరిస్టులను మట్టుబెట్టాయి. ఓ నివాసంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్...
కొమరోలు ఎస్సైగా వెంకటేశ్వర నాయక్
ప్రధాని మోదీకి ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ ఏలూరి
మార్కాపురం డిఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన నాగరాజు
గణేశ్ ఉత్సవాల్లో మాజీ ఎమ్మెల్యే అన్నా
జిల్లాలో 13 మంది ఎస్ఐ లకు స్థాన చలనం
దేశద్రోహి రాహుల్ గాంధీ... రిజర్వేషన్ల వ్యతిరేకి కాంగ్రెస్ పార్టీ